రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వివాదం మళ్లీ రాజుకుంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రఫేల్ ఒప్పందం ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. చౌకీదార్ చోర్ హై అని ధ్వజమెత్తారు. ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపిందని ఆరోపించారు.
మరోవైపు రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని మాజీ భారత రక్షణ కార్యదర్శి జి.మోహన్‌కుమార్ ఆరోపించారు.
రఫేల్ వివాదంపై తాజాగా రాహుల్ గాంధీ మోదీని, కేంద్రాన్ని విమర్శించిన కాసేపటికే మోహన్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుందని, రక్షణ శాఖను సంప్రదించకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారాయన.
భారత సార్వభౌమధికారంపై ఫ్రాన్స్ నుంచి లేఖ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోలేదని భారత మాజీ రక్షణ కార్యదర్శి జి. మోహన్ కుమార్ ఆరోపించారు. యుద్ధ విమానాల ఒప్పందాల ఖర్చు గురించి ప్రధాని కార్యాలయం చూసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. మిగిలిన విషయాల పట్ల రక్షణశాఖ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందన్నారు మోహన్. 2015 నుంచి 2017 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు మోహన్ కుమార్.