ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 21 వేల దివ్యాంగ ఓటర్లు ఉంటే... అందులో 3 లక్షలకు 37 వేల 259 ఓటర్లు ఈవీఎంలలో తమ ఓటును నిక్షిప్తం చేశారు. దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ ముందుగానే కసరత్తు చేసింది. జిల్లాల వారీగా దివ్యాంగ ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేసింది. మొత్తం దివ్యాంగుల్లో సుమారు 65శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. దివ్యాంగ ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు తరలిరావడం చాలా మందికి స్ఫూర్తి నిచ్చిందని ద్వివేది వెల్లడించారు.
జిల్లాల వారీగా...
శ్రీకాకుళం నుంచి 91.11% మంది దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్పంగా విజయనగరంలో 47.23% మంది ఓటు వేశారు.
జిల్లాల వారీగా ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగులు
జిల్లా | మొత్తం ఓటర్లు | ఓటు వేసిన వారు | నమోదు శాతం |
అనంతపురం | 44,115 | 28,192 | 63.90 % |
గుంటూరు | 40,921 | 26,552 | 64.88 % |
ప్రకాశం | 35,833 | 26,467 | 73.86% |
నెల్లూరు | 35,247 | 25,469 | 72.25 % |
విజయనగరం | 36,418 | 17,201 | 47.23% |
విశాఖపట్నం | 44,163 | 25,116 | 56.87% |
తూర్పుగోదావరి | 55,732 | 29,609 | 53.12% |
పశ్చిమగోదావరి | 44,010 | 28,917 | 65.70% |
కృష్ణా | 36,945 | 24,849 | 67.25% |
కర్నూలు | 39,977 | 29,012 | 72.57% |
చిత్తూరు | 50,965 | 38,121 | 74.79% |
శ్రీకాకుళం | 29,787 | 27,140 | 91.11% |
కడప | 26,916 | 20,344 | 75.95% |
ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రంలో ఉన్న వివిధ కేటగిరిల చెందిన దివ్యాంగ ఓటర్లను గుర్తించేందుకు రాష్ట్రవికలాంగ సంక్షేమ శాఖతో సమన్వయం చేసుకుంటూ మ్యాపింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించగలిగామని ఈసీ తెలిపింది. దృష్టి లోపం గల దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో అభ్యర్థుల పేర్లు లిఖించారు. ఇలా చేయడం వలన దృష్టి లోపం ఉన్న వారు సులభంగా ఓట్లు వెయ్యగలిగారని ద్వివేది అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు, వీల్ఛైర్స్ అందుబాటులో ఉంచి సహకరించామన్నారు. ఓటు వేసేందుకు దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యాల ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించామన్నారు. దివ్యాంగుల ఓటింగ్ శాతం పెరగడం... మంచి పరిణామమని ఈసీ అభిప్రాయపడింది.