ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చదువులతల్లి.. మాంటిసోరి కోటేశ్వరమ్మ ఇక లేరు - krishna district

తాను స్థాపించిన విద్యా సంస్థ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహిళా విద్యా వేత్త మాంటిసోరి కోటేశ్వరమ్మ తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని స్వగృహంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ చదువుల తల్లి... ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు.

మాంచిసోరి స్కూల్​ అధినేత్రి ఇక మనకు లేరు

By

Published : Jun 30, 2019, 10:58 AM IST

Updated : Jun 30, 2019, 11:16 AM IST

ప్రఖ్యాత మహిళా విద్యా వేత్త మాంటిసోరి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈ తెల్లవారుజామున కృష్ణా జిల్లా కంకిపాడులోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. స్త్రీ విద్యే పరమావధిగా విజయవాడలో విద్యా సంస్థను నెలకొల్పి,,, ఆరు దశాబ్దాలుగా విద్యారంగంలో ఎనలేని కృషి చేశారు. గుర్తింపుగా.. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారం గౌరవించింది.

ఆడపిల్లలకు ఉన్నత విద్య అంటే నీళ్లు నమిలే కాలంలో ఆమె అదే తన జీవిత ధ్యేయంగా ఎంచుకుని 1955లో ప్రాథమిక విద్యతో మాంటిస్సోరి విద్యా సంస్థను స్థాపించారు. ఓ చిన్న మొక్కగా ప్రారంభమైన సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మహావృక్షంగా ఓ ఉన్నత విద్యా సంస్థగా ఎదిగింది. ఆరు దశాబ్దాలకు పైబడిన విద్యా ప్రస్థానంలో కోటేశ్వరమ్మ వేలాది మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించారు. తన విజయానికి గుర్తుగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

చదువులతల్లి.. మాంటిసోరి కోటేశ్వరమ్మ ఇక లేరు

జీవిత ప్రస్థానం

కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 సెప్టెంబర్ 15న కోటేశ్వరమ్మ జన్మించారు. ఈడుపుగల్లులో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించిన ఆమె 1941లో విజయవాడలో ఇంటర్ పూర్తి చేశారు. 1945లో గుంటూరులో డిగ్రీ , 1947లో రాజమండ్రిలో బీఈడీ, 1972లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చదివారు. 1979 -80లలో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి వీరేశలింగం సాహిత్యం మీద డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఒకవైపు తన విద్యార్హతలను పెంచుకుంటూనే తాను స్థాపించిన విద్యాసంస్థను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. విద్యావేత్తగా ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన కోటేశ్వరమ్మ అవార్డులను దక్కించుకున్నారు. 1971లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 1980లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు బహుకరించారు. రాష్ట్రీయ విద్యా సరస్వతి పురస్కారం లైఫ్ టైం ఎచీవ్​మెంట్ వంటి ఎన్నో అవార్డులు కోటేశ్వరమ్మను వరించాయి. విద్యా రంగానికి ఎనలేని కృషి చేసిన కోటేశ్వరమ్మ మృతి పట్ల పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇదీ చదవండీ :

వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సంయుక్త కలెక్టర్

Last Updated : Jun 30, 2019, 11:16 AM IST

ABOUT THE AUTHOR

...view details