సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశా: రోజా
మంత్రివర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. భవిష్యత్లో మంత్రి పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు సమావేశం అనంతరం ఆమె తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. అసంతృప్త నేతలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి... పిలిపించి జగన్‌తో మాట్లాడించారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మంత్రి పదవికి సైతం పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. అయితే.. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని సమావేశం అనంతరం రోజా తెలిపారు. భవిష్యత్తులో మంత్రి పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన ఆమె.. మంత్రి పదవి కంటే జగన్ సీఎం కావడం ఆనందంగా ఉందన్నారు. మా పార్టీలో అలకలు, బుజ్జగింపులు ఏమీ ఉండవు అన్నారు. నవరత్నాల అమలే మా ప్రభుత్వ లక్ష్యమని రోజా స్పష్టం చేశారు.