భాజపాను 63 శాతం ప్రజలు వ్యతిరేకించారు : సీపీఐ నేత నారాయణ అభివృద్ధి చెందిన దేశాలే ఈవీఎంలను నిషేధించాయన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ...భారత్‌లోనూ ఈవీఎంలను తొలగించి...బ్యాలెట్ విధానంలో ఎన్నికల జరపాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. గుంటూరు అరండల్‌పేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ... ఎన్నికల్లో భాజపాకు 37 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. మిగిలిన 63 శాతం ప్రజలు భాజపాను వ్యతిరేకించారని గుర్తు చేశారు. మైనారిటీ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని అన్నారు. అందుకే సీపీఐ దామాషా విధాన ఎన్నికలకు డిమాండ్ చేస్తోందన్నారు. దామాషా ఎన్నికలతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అన్ని వామపక్ష పార్టీలు తిరిగి ఏకమైతేనే అవకాశవాద రాజకీయ శక్తులను ఎదుర్కోగలమని నారాయణ అన్నారు.