కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఈ రోజు న్యూయార్క్ నుంచి భారత్‌కు చేరుకున్నారు. అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకున్న 66 ఏళ్ల జైట్లీ, స్వదేశానికి తిరిగి రావడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.
అరుణ్‌జైట్లీ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కారణంగా ఆర్థికశాఖను పీయూష్‌గోయల్‌కు తాత్కాలికంగా అప్పగించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 2019 మధ్యంతర బడ్జెట్‌ను, రైల్వే బడ్జెట్‌ను తాత్కాలిక అర్థికమంత్రి పీయూష్‌గోయల్ ప్రవేశపెట్టారు.
అయితే మోదీప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను జైట్లీ న్యూయార్క్ నుంచే ప్రతిఘటించారు. విపక్షాల విమర్శలకు తన ట్వీట్లతో, ఫేస్బుక్ పోస్టులతో ధీటుగా బదులిచ్చారు జైట్లీ. ఈ విషయంపై మీడియాతో ముఖాముఖిలో సైతం జైట్లీ పాల్గొన్నారు.
అరుణ్‌జైట్లీకి ఇంతకు మునుపు 2018లో మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఆ సందర్భంలో సైతం సుమారు 100 రోజులపాటు జైట్లీ బాధ్యతలను పీయూష్‌గోయల్ చేపట్టారు.
మధుమేహంతో బాధపడుతున్న జైట్లీకి 2014లో బేరియాట్రిక్ సర్జరీ సైతం జరిగింది.