ఈ నెల 30న నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కలియుగ వైకుంఠనాధుని దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో జగన్ బస చేశారు. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అందుకుగాను తితిదే అధికార యంత్రాగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.....తొలిసారిగా తిరుపతికి వచ్చిన జగన్కు... రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు రోడ్డు మార్గంలో వచ్చిన జగన్కు దారిపొడవునా ప్రజలు సాదర ఆహ్వానం పలికారు.
సీఎంగా పరిపాలన చేపట్టే ముందు భగవంతుని ఆశీస్సుల కోసం... తిరుపతి పర్యటనకు జగన్ వచ్చారు. తిరుపతి పర్యటనకు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్... గన్నవరం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, వైకాపా సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి తదితరులతో కలిపి.. 13మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. వారితో కాసేపు ముచ్చటించిన జగన్...విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీగా అలిపిరి గుండా తిరుమల చేరుకున్నారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ సాగారు.