ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

భాజపా, వైకాపా ఆదేశాలతో  సీఈసీ చర్యలు: ముఖ్యమంత్రి - లేఖ

ఎన్నికల్ని స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ కొంతమంది వ్యక్తుల ఆదేశాల మేరకు పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. సీఈసీ పనితీరును తప్పుపడుతూ లేఖ రాశారు.

ముఖ్యమంత్రి రాసిన లేఖ

By

Published : Apr 10, 2019, 11:05 AM IST


భాజపా, వైకాపా ఆదేశాలతో తెదేపాను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని తప్పుబట్టారు. సీఎస్​గా నియమితులైన కె.కె. శర్మను ముందు బంగాల్​కు ప్రత్యేక పరిశీలకునిగా నియమించారనీ.. దానికి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపిందని వివరించారు. బంగాల్ అభ్యంతరం తెలిపాక ఏపీకి ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఆర్​ఎస్​ఎస్ నేపథ్యం ఉన్న అధికారిని రాష్ట్రంలో పోలీసు పరిశీలకుడిగా నియమించడమేమిటన్నారు.

తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా ఐటీ దాడులు
తెదేపా అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. ఈ చర్యలు చూస్తుంటే ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న భావన కలుగుతోందన్నారు. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాలు, తమిళనాడులో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. 66 మంది విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులు ఈసీ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాశారనీ... అంతమంది తప్పపట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ బదిలీ పోలీసు శాఖకు తప్పుడు సంకేతాలు పంపిందని చెప్పారు.

వైకాపా ఫిర్యాదులపై ఎందుకంత స్పందన?
వైకాపా ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోందనీ.. నిజానిజాలు నిర్ధరించుకోకుండా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇదే సమయంలో తెదేపా ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 31 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నాయకుడి ఆరోపణలకు ఎందుకంత ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.

సీఈసీకి ముఖ్యమంత్రి లేఖ

ఇవీ చదవండి..

ఈసీ విశ్వసనీయతపై అనుమానాలు'

ABOUT THE AUTHOR

...view details