ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య నిమ్మ వెంకట్రావు తెలిపారు. ఆసెట్ ప్రవేశ పరీక్షకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరులలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని ఆయన అన్నారు. ఆఈట్ పరీక్షకు విశాఖ, కాకినాడ, విజయవాడలలో 8 కేంద్రాలు సిద్ధం చేశామని వెల్లడించారు.
ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలకు మొత్తం 22,799 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు డైరెక్టర్ వెంకట్రావు అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచే హాల్ టికెట్లు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. పరీక్ష సమయానికి ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని డైరెక్టర్ అన్నారు. పరీక్షలను రోజులో మూడు సెషన్లలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.