ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి భాజపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ జనా'కర్షక' మని రుజువైంది. 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో నేరుగా 6వేల రూపాయలు పెట్టుబడి సాయంగా జమచేయనున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఐతే రైతులకు తెలంగాణ, ఒడిశా ప్రభుత్వ పథకాలు అందించే దాని కంటే తక్కువే.
2019-20 మధ్యంతర బడ్జెట్ ద్వారా రెండున్నర హెక్టార్లున్న రైతుల ఖాతాలో ఏడాదికి 6వేల రూపాయలు జమకానున్నాయి. 12 కోట్ల మంది రైతులు లబ్ధిపొందునున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.75వేల కోట్లు కేటాయించింది. కేంద్ర పథకానికి, తెలంగాణ, ఒడిశాలో రైతు పథకాలకు ఎంతో వ్యత్యాసం ఉంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రెండున్నర హెక్టారుల భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ రైతు బంధుకు అలాంటి నిబంధనలు లేవు, రబీ పంట కాలంలో యాభై ఎకరాలకు పరిమితం చేసింది. కేంద్ర పథకంలో 6వేల రూపాయలు మూడు విడతలుగా ఇవ్వనున్నారు. తెలంగాణలో 8వేల రూపాయలు రెండు విడతల్లో ఇస్తారు. 10 వేల రూపాయలకు పెంచుతామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఒడిశా ప్రభుత్వం కలియా పథకం ద్వారా ఒక రైతు కుటుంబానికి ఐదు కాలాలకు 25,000 రూపాయలను అందిస్తోంది. 2018 రబీ కాలం నుంచి ఇది అమలవుతోంది.
"ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. తెలంగాణలోని రైతు బంధు పథకం, ఒడిశాలోని 'కలియా' పథకాలు ఇస్తున్న దానికంటే తక్కువే. వాటితో పోలిస్తే ఇది అంత ప్రభావం చూపకపోవచ్చు. కానీ ఎన్నికల ముందు ప్రభుత్వం రైతులకు చేరువకావడానికి ఉపయోగపడుతుంది" - ఎంజే. ఖాన్ , భారత వ్యవసాయ, ఆహార మండలి ఛైర్మన్