అమర్నాథ్ కుటుంబానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఆహ్వానం - YSRCP Victim Families to CBN Oath - YSRCP VICTIM FAMILIES TO CBN OATH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 9:27 PM IST
YSRCP Victim Amarnath Family invited to Chandrababu Oath: బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ను పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన అందరికీ తెలిసిందే. అయితే విషయం తెలిసిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, చంద్రబాబు తమ ఇంటికి వచ్చి పరామర్శించారని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు. తమకు జరిగిన అన్యాయంపై తెలుగుదేశం అండగా నిలిచి అమర్నాథ్ సోదరిని దత్తత తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.
తమ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో నిందితులకు సరైన శిక్ష పడలేదని టీడీపీ ప్రభుత్వంలో కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు అమర్నాథ్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా వైఎస్సార్సీపీ బాధిత కుటుంబాలకు నాడు టీడీపీ అండగా నిలిచిందని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన వారిలో అమర్నాథ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్సార్సీపీ బాధితులైన మొత్తం 112 కుటుంబాలకు టీడీపీ ఆహ్వానం పంపించింది.