కనిగిరిలో వైఎస్సార్సీపీ నేతల బరితెగింపు - రాజీనామా చేయని వాలంటీర్లకు బెదిరింపులు - YSRCP Forced on Volunteer Resign - YSRCP FORCED ON VOLUNTEER RESIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 11:46 AM IST
YSRCP Leaders Forced on Volunteer Resign in Prakasam District : ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైఎస్సార్సీపీ నాయకులు వాలంటీర్ల రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో 210 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇప్పటికే 49 మంది రాజీనామా చేయగా గురువారం మరో 150 మందితో బలవంతంగా భయపెట్టి రాజీనామా చేయించారు. రాజీనామా చేసిన వాలంటీర్లకు 5 వేల రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసినా 11 మంది వాలంటీర్లు మాత్రం రాజీనామా చేయకుండా ఎదురు తిరిగినట్లు సమాచారం.
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లను వైఎస్సార్సీపీ కార్యాలయానికి రప్పించి అధికార నేతలు రహస్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, కోఆర్డినేటర్ ద్వారా నయానో భయానో వాలంటీర్లను భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా రాజీనామా చేయించారు. మీరు ఇప్పుడు డబ్బులు తీసుకుని రాజీనామా చేసి వెళితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెలిచిన అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. కనిగిరి పట్టణంలోని వాలంటీర్లను వాట్సాప్ మెసెజ్‌ల ద్వారా గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయానికి రప్పించి రాజీనామా చేయించారు. ఇంటింటికి వెళ్లి నేరుగా వాలంటీర్ల ద్వారా తాయిలాలు పంచేందుకు వైఎస్సార్సీపీ నాయకులు వాలంటీర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.