చెన్నకేశవస్వామి ఆలయ భూమి కబ్జా చేయలేదు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి - భూకబ్జా ఆరోపణలు ఖండించిన రాచమల్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 10:36 AM IST
YCP MLA Rachamallu Denied Allegations of Former MLA Varadarajulu : చెన్నకేశవస్వామి భూమిని కబ్జా చేసినట్లు తనపై వచ్చిన ఆరోపణలను వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఖండించారు. మాజీ ఎమ్మెల్మే వరదరాజులరెడ్డి తనపై కుట్రపన్నుతున్నారని రాచమల్లు తెలిపారు. ఆలయ భూమి అపరిశుభ్రంగా ఉండటం వల్ల శుభ్రం చేయించి చుట్టూ కంచె పాతాలని ఆలయ ఈవోకు పలుమార్లు ఆర్జీ పెట్టినా స్పందించలేదన్నారు.
భగవంతుని ఆస్తులను ఎవరు ఆక్రమించినా, ఆక్రమించారని అబద్ధాల ఆరోపణలు చేసినా కూడా నాశనమే అవుతారని ఎమ్మెల్యే శివప్రసాదు రెడ్డి విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపణలకు ఆయన స్పందించారు. దొరసానిపల్లె గ్రామంలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం ఆస్తులకు సంబంధించిన స్థలంలో కంప చెట్లు దుర్గంధం ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అసౌకర్యంగా ఉందని భావించి శుభ్రం చేశానే తప్పా ఎలాంటి ఆక్రమణ చేయలేదన్నారు. ప్రజలకు అసౌకర్యంగా ఉందని తన సొంత నిధులతో రోడ్లు వేయించారని తెలియజేశారు.