పోలింగ్ బూత్ కేంద్రానికి వైసీపీ రంగులు - అడ్డుకున్న కూటమి శ్రేణులు - YCP colors for polling booth
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 4:01 PM IST
YCP colors for polling booth center: వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా, ఇంకా తమ ప్రభుత్వం ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో ఉన్నారు. అందులో భాగంగా అధికారులను సైతం ప్రభావితం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌కు సైతం వైసీపీ రంగులు వేసి ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు. అధికారులు, వైసీపీ నేతల చర్యలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు అడ్డుకట్ట వేశారు.
ఎన్నికలకు ఐదు రోజులు గడువు ఉన్న సమయంలో, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఏలూరు 23వ డివిజన్ 57వ పోలింగ్ బూత్ కేంద్రానికి, వైసీపీ రంగులు వేశారు. వైసీపీకి చెందిన ఆకుపచ్చ రంగు వేయడంపై స్థానికులు, విపక్ష పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ రంగు వేసిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కు దృష్టికి తీసుకువెళ్లినట్లు టీడీపీ నేతలు తెలిపారు. స్పందించిన కమిషనర్ తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు కూటమి నేతలు పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ ను కోరినట్లు కూటమి నేతలు వెల్లడించారు.