విశాఖలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 11:57 AM IST
Vote Registration Awareness Conference: ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విశాఖలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో విద్యార్థులకు ఓటుపై అవగాహన కల్పించారు. ఓటు నమోదుపై యువతకున్న సందేహాలను వక్తలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ఓటు హక్కు ద్వారా మాత్రమే మనం కోరుకున్న ప్రజాస్వామ్యాన్ని చూడగలమని కళాశాల డీన్ డాక్టర్ పీ.వీ సుధాకర్ అన్నారు. విద్యావంతులు, యువత అత్యధికులు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అనర్హులు, అవినీతిపరులు రాజ్యమేలుతున్నారని తెలియజేశారు.
ఓటు అనేది హక్కు మాత్రమే కాదని దానిని వినియోగించుకునే బాధ్యతను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ప్రతి యువ ఓటరుకి ఉందని పేర్కొన్నారు. ఓటు నమోదు ఆవశ్యకతను, ఓటు ఎలా వేయాలి? ఎందుకు వేయాలి? తదితర విషయాలను విద్యార్థులకు ఆయన వివరించారు. సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొనగా 145 మంది ఆన్లైన్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఓటు హక్కు గురించి ఇన్నాళ్లు పుస్తకాల్లో చదువుకున్నామని, ఇప్పుడు దానిని వినియోగించుకోవడానికి అర్హులైనందుకు సంతోషంగా ఉందని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.