జగన్ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందని ప్రజలందరూ నమ్ముతున్నారు: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ - Union Minister on SC Verdict - UNION MINISTER ON SC VERDICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 10:05 PM IST
Union Minister Bhupathiraju on Supreme Court Verdict: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర ఉక్కు, పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. బీజేపీ గతంలో కూడా అనేక సార్లు గత ప్రభుత్వాన్ని నిలదీసిందని సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని విమర్శించారు. రథం తగలబెట్టినా, రాముడి తల తొలగించినా ఒక్కరిని కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్తులు తిరుమల వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉందని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగనే డిక్లరేషన్ తిరస్కరించారని అన్నారు. లడ్డూ వివాదంలో కూడా జగన్ ప్రభుత్వంలో తప్పు జరిగిందని ప్రజలంతా నమ్ముతున్నారని చెప్పారు. వాస్తవాలు పూర్తిగా బయటకి తీసేలా సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్ బృందాన్ని నియమించడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.
విశాఖ ఉక్కుకు శాశ్వత పరిష్కారం: విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే కేంద్రం ఉద్దేశమని భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. కార్మికుల పొట్టకొట్టాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. విశాఖ ఉక్కును కాపాడాలనే ప్రజల సెంటిమెంట్‌ను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.