జగన్ అక్రమాస్తుల కేసు - 2 నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 10:53 AM IST
TS High Court Orders on Jagan Illegal Property Cases: జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు ఏప్రిల్ 30 వరకు తెలంగాణ హైకోర్టు గడువు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా నిందితులు వేసిన 130 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో సుదీర్ఘ కాలంగా విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ హైకోర్టు కోర్టును ఆదేశించింది.
ఎక్కువగా రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నందున ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించాలని సీబీఐ కోర్టు ఫిబ్రవరి 15న హైకోర్టును కోరింది. డిశ్చార్జి పిటిషన్లపై విచారణ తుది దశకు చేరిందని సుమారు 13వేల పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సీబీఐ కోర్టు హైకోర్టుకు వివరించింది. సీబీఐ కోర్టు వినతిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.