తిరుమలలో ట్రాక్టర్ బీభత్సం - ఇద్దరు భక్తులకు గాయాలు - Tractor Hit Tirumala SV Complex
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 1:16 PM IST
Tractor Hit the Gate of Tirumala SV Complex : తిరుమల ఎస్వీ కాంప్లెక్స్ వద్ద ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. బ్రేకు వేయబోయి డ్రైవర్ పొరపాటున యాక్సిలెటర్ను తొక్కాడు. ఇంకా ఏముంది ఆ ట్రాక్టర్ ఎస్వీ కాంప్లెక్స్ గేటును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు తమిళ భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్విమ్స్ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అందరు చూస్తూ ఉండగానే ట్రాక్టర్ వేగంగా వచ్చి గేటును ఢీ కొట్టిందని స్థానికులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల సమయంలో భక్తుల రద్దీ తక్కువ ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు పేర్కొన్నారు.స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను సీజ్ చేసి, డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను డ్రైవరును అడిగి తెలుసుకున్నారు. నిత్యం ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని తమకు కావలసిన సామగ్రిని ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తుంటారని స్థానికులు తెలియజేశారు.