లారీలు అద్దెకు తీసుకుని అంతర్రాష్ట్ర చోరీలు - పోలీసులకు చిక్కిన ముఠా - పార్థి ముఠా దొంగతనలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 4:41 PM IST
Thieves Gang Arrested: భారీ లారీలను అద్దెకు తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అంతగా భారీ వాహనాలకు అద్దెకు తీసుకుని ఏదో చిన్న చిన్నగా దొంగతనాలు మాత్రం కాదండోయ్ వీరు చేసేది. ఏకంగా పెట్రోల్ బంకుల్లోనే చోరీకి తెర తీశారు. అద్దెకు తీసుకున్న లారీలతో పలు రాష్ట్రాల్లో సంచరిస్తూ, బంకుల్లోని ఇంధనం, గోదాముల్లోని టైర్లకే చెక్ పెడుతున్నారు. అనంతపురం జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెట్రోల్ బంకుల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అనంతపురంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. 12 టైర్ల లారీలను రెండింటిని అద్దెకు తీసుకుని. అర్థరాత్రి దాటిన తర్వాత పలు రాష్ట్రాల్లో సంచరిస్తూ నగర శివారు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లోని ఇంధనాన్ని, టైర్ల గోదాముల్లోని టైర్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Petrol Theft Gang: ఈ దొంగిలించిన ఇంధనాన్ని, టైర్లను తమకు నమ్మకమైన వారికే ఈ ముఠా విక్రయిస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఈ ముఠాపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే వీరు దోపిడీకి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది వీరికి ఎదురు తిరిగితే మారణాయుధాలతో బెదిరించి దొంగతనాలకు పాల్పడిన ఘటనలున్నాయని పోలీసులు వివరించారు. రోజురోజుకూ వీరి సమస్య జఠిలం కావడంతో అనంతపురం పోలీసులు వీరిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. దొంగతానాలకు పాల్పడుతున్న ఈ పార్థి ముఠాలోని ఐదుగురు సభ్యులను, పెట్రోల్, టైర్లు కొనుగోలు చేస్తున్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 3.50 లక్షల రూపాయల నగదు, లారీలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసకున్నట్లు అనంతపురం జిల్లా ఏస్సీ అన్భురాజన్ తెలిపారు. లారీల విలువ సుమారు 35లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.