పవన్ ఎంపీగా పోటీ చేస్తే - పిఠాపురం నుంచి బరిలో నేనే: మాజీ ఎమ్మెల్యే వర్మ - TDP Leader Varma
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 8:27 PM IST
TDP Leader Varma Comments on Pithapuram Constituency : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ తరపున కాకినాడ ఎంపీగా పవన్ కల్యాణ్ బరిలోకి దిగితే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులోని తన గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ కోసం పని చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తన సీటును త్యాగం చేయవలసి వచ్చిందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి తను కట్టుబడి ఉన్నానని వర్మ పేర్కొన్నారు.
పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను 24 గంటలు పని చేస్తానని వర్మ వ్యాఖ్యానించారు. తన రక్తాన్ని ధారపోసి అయినా పవన్ కల్యాణ్‌ను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ కల్యాణ్ కాకుండా మరొకరికి తాను మద్ధతు ఇవ్వనని సృష్టం చేశారు.
పవన్ ఏమన్నారంటే : ఇటీవల పవన్ కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ తెలిపారు. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, తాను ఉదయ్ స్థానాలు మార్చుకున్నామని అన్నారు. బీజేపీ అధిష్టానం తనను ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే ఆలోచిస్తానని అన్నారు. తాను ఎంపీగా పోటీ చేస్తే, ఉదయ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.