వైఎస్సార్సీపీ పాలనలో ముస్లింలకు స్వేచ్ఛ, భరోసా లేకుండా పోయింది: చంద్రబాబు - Chandrababu Meeting With Muslims - CHANDRABABU MEETING WITH MUSLIMS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 12:17 PM IST
Chandrababu Naidu Meeting With Muslims : వైఎస్సార్సీపీ పాలనలో ముస్లింలకు స్వేచ్ఛ, భరోసా లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతు ఇచ్చిన అధికార పార్టీ, ఇక్కడ గల్లీ రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణ, పల్ల శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో మైనార్టీలకు న్యాయం జరగలేదని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింల కోసం ప్రవేశ పెట్టిన పథకాలకు జగన్ సర్కార్ తూట్లు పొడిచిందని నిప్పులు చెరిగారు. సంక్షేమ పథకాల అమలులోనూ వివక్ష చూపారని వివరించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో ముస్లింల కోసం ప్రత్యేక అంశాలు పొందుపరిచారని చంద్రబాబును ప్రశంసించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.