అనకాపల్లి జిల్లాలో మహాశివరాత్రి తిరునాళ్లు - ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 6, 2024, 5:15 PM IST
Shivaratri Special APSRTC Services to Narsipatnam : ఈనెల ఏడో తేదీ మొదలుకొని మూడు రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి (Shivaratri) తిరునాళ్లకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. ఇందుకు ఆర్టీసీ (RTC) యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని రావికమతం మండలం కళ్యాణపు లోవ పోతురాజు తిరునాళ్లకు, గొలుగొండ మండలం దారమటంలోని పుణ్యక్షేత్రాలకు (Temples) కలిపి మూడు రోజులకు గాను నర్సీపట్నం డిపో నుంచి 50 ప్రత్యేక బస్సులను నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో అధికారులు తెలిపారు.
ఈ సర్వీసులను ఈ నెల 7వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు కొనసాగిస్తున్నట్టు వారు తెలిపారు. కళ్యాణపు లోవ పోతురాజు ఉత్సవాలకు సంబంధించి కొత్తకోట, కసిరెడ్డిపాలెం, కొంతలం, రావికమతం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. దారమటం పుణ్యక్షేత్రానికి సంబంధించి గొలుగొండ కృష్ణదేవపేట, కంటారం, జోగంపేట తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.