మంగళగిరి ఎయిమ్స్ విషయంలో తమ పార్టీ నేతపై పోలీసు దాడి సరికాదు- సీఐపై చర్యలు తీసుకోవాలి: పురందేశ్వరి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 8:21 PM IST
CI attack on BJP Yuva Morcha leader: బీజేపీ యువమోర్చా నేతపై సీఐ దాడి చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఓట్లతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని, ఎయిమ్స్ నిర్మాణం కు భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ప్రతి రూపాయి కేంద్రమే ఇచ్చిందని చెప్పారు. ఎయిమ్స్ నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఎయిమ్స్ ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నీరు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎయిమ్స్ పక్కనే డంప్‌యార్డ్ పెట్టడం వలన దుర్గంధం వస్తుందని ఆరోపించారు. ఆరోగ్య పరిస్ధితులకు మంచి దాఖలాలు లేవని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. యువ మోర్చా ఫ్లెక్సీ పెట్టడంలో తప్పేం లేదన్నారు. ఎయిమ్స్ నిర్మాణంలో ప్రతి రూపాయి కేంద్రమే ఇచ్చిందని, లేకపోతే లక్ష ఇస్తామని తమ యువ మోర్చా నేతలు ఫ్లెక్సీ పెట్టి మరీ అడిగారన్నారు. సీఐ యువ మోర్చా కార్యకర్తపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు సీఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని వదిలేది లేదని స్పష్టం చేశారు.