2027 పుష్కరాల నాటికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం : మంత్రి దుర్గేష్ - Durgesh Focus Godavari Pushkaralu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 10, 2024, 10:38 AM IST
Durgesh Focus On Godavari Pushkaralu in AP : 2027లో జరిగే పుష్కరాల నాటికి గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన పుష్కరాల నిర్వహణపై తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలపై నదిలో పర్యటిస్తూ, నేతలతో చర్చించారు.
ఈ క్రమంలోనే ఘాట్ల సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచటం వంటి పనులను చేపడతామని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ పనులను కేవలం తాత్కాలికంగా కాకుండా, పర్మినెంట్గా ఉండే విధంగా చేపట్టనున్నట్లు చెప్పారు. అదేవిధంగా గోదావరి పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయనున్నట్లు కందుల దుర్గేష్ వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.