బహిరంగ సభలకు జనం వచ్చే పరిస్థితి లేదు- ఖర్చు కోసం వెనకడుగు వెయొద్దు : ధర్మాన - minister dharmana on elections - MINISTER DHARMANA ON ELECTIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 7:46 PM IST
Minister Dharmana Prasada Rao Comments: గత కొంతకాలంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ధర్మాన, తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం ఎన్నికల బహిరంగ సభలకు జనం ఎవరూ వచ్చే పరిస్థితి లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. వివిధ మాధ్యమాల ద్వారా బయట జరుగుతున్న తీరును ప్రజలు ముందే పసిగట్టుతున్నారన్నారు. దీనికి తగ్గట్టుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళిక బద్దంగా చేయాలని ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఖర్చు కోసం వెనకడుగు వేయ్యకుండా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయ్యాలని మంత్రి ధర్మాన కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ధర్మాన ఈ విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో మరిన్ని వ్యాఖ్యలు సైతం చేశారు. జనాభా పరంగా ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉండటంపైనా వ్యంగ్యంగా స్పందించారు. దేశం సాధించిన ప్రగతి ఇదేనంటూ వ్యాఖ్యానించారు. అయితే గతంలో ఎన్నికల్లో తాను ఓడిపోయినా పర్వాలేదంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.