LIVE: లోక్‌సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - LOK SABHA SESSION 2025
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2025, 11:21 AM IST
|Updated : Feb 7, 2025, 5:43 PM IST
Lok Sabha Session 2025 Live : అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా ఆ క్రమంలో వారికి సంకెళ్లు వేస్తుండటంపై రాజ్యసభ, లోక్‌సభలు భగ్గుమన్నాయి. అవమానకరమైన ఈ చర్యను నిలువరించడానికి ప్రభుత్వం ఏం చేయబోతోందని విపక్షం ప్రశ్నించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీకి ఎంతోగొప్ప మిత్రబంధం ఉన్నట్లు చెబుతారని, మరి దీనిని మోదీ ఎందుకు అడ్డుకోవడం లేదని వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. గొలుసులు, సంకెళ్లతో తెచ్చే బదులు మన విమానాలను అక్కడకు ఎందుకు పంపించకూడదని అన్నారు. స్పీకర్ స్థానం వద్ద ఎంపీలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనలతో లోక్‌సభ స్వల్పవ్యవధితో నాలుగుసార్లు వాయిదాపడింది. కేంద్ర బడ్జెట్‌పై చర్చ చేపట్టేందుకు అవకాశం లభించక చివరకు శుక్రవారానికి వాయిదాపడింది. అక్రమ వలసదారులను మాతృదేశానికి తరలిస్తున్న తీరుపై లోక్‌సభ సమావేశ ప్రారంభంలోనే విపక్ష ఎంపీలు గళమెత్తారు. అమెరికా నుంచి సైనిక విమానంలో తొలివిడతగా 104 మందిని అమృత్‌సర్‌కు తెచ్చిన తీరును ఆక్షేపించారు. వలసదారుల అంశంపై పార్లమెంటు సముదాయంలో తొలుత రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, అఖిలేశ్‌యాదవ్, వామపక్ష నేతలు తదితరులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు ఏం జరగనుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Last Updated : Feb 7, 2025, 5:43 PM IST