పరిపాలన రాజధాని అంటూ మాయ మాటలు - వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: జనజాగరణ సమితి - ANDHRA PRADESH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 1:30 PM IST
Jana Jagarana Samithi Fires on YSRCP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే జోన్కు భూములు అప్పగించిన మరుక్షణమే జోన్ పనులు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనతో వైసీపీ ప్రభుత్వ బండారం బయటపడిందని జన జాగరణ సమితి కన్వీనర్ వాసు తెలిపారు. విశాఖలో వేల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నేతలను ప్రోత్సహిస్తారని ఆరోపించారు. కానీ రైల్వేకి సంబంధించిన 53 ఎకరాల భూములను జోన్ కోసం అప్పగించడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని మండిపడ్డారు.
వైసీపీ నేతలు ఎవరైనా రైల్వే భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తే ముఖ్యమంత్రి జగన్ దర్జాగా ఒప్పుకుంటారని విమర్శించారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నారని గుర్తు చేశారు. రైల్వేకి చెందిన భూములను అప్పగించడానికి ముఖ్యమంత్రి జగన్ ఇంతలా ఆలస్యం చేస్తున్నారంటే వైసీపీకి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అంటూ మాయ మాటలు చెప్పిన వైసీపీ ప్రభుత్వానికి, ప్రజలంతా ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.