తాను పంపిణీ చేసినవి దొంగ పట్టాలుగా నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా!: బాలినేని - మాజీ మంత్రి బాలినేని
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 10:45 PM IST
Balineni Srinivasa Reddy distributed house sites: ఒంగోలులో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను దొంగ పట్టాలుగా నిరూపిస్తే, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. ఒంగోలులో లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బాలినేని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల పట్టాలతో పాటుగా, దంపతులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర తనకే దక్కుతుందన్నారు. మొదటి నుండి కొందరు కావాలనే తాను పట్టాలు ఇవ్వలేనని ప్రచారం చేస్తున్నారని బాలినేని పేర్కొన్నారు. స్థలం సిద్దం చేశాక ఎలక్షన్ కోడ్ వస్తుందంటూ, పట్టాల పంపిణీ కుదరదంటూ అపోహలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు పట్టాలందించడంలో సీఎం జగన్ తోడ్పాటు గొప్పదన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వదిలేకుండా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తానని వారికి భరోసా కల్పించారు. సంవత్సరం కాలంలోనే లబ్ధిదారులు ఎక్కడైతే ఇల్లు నిర్మించుకుంటారో దానిని ఒక టౌన్షిప్ గా ఏర్పాటు చేసి, అందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తానని బాలినేని హామీ ఇచ్చారు.