విజయవాడలో ఫెడరల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ - డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ - Federal Bank branch Opening
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 10:49 PM IST
Federal Bank branch Opening in Vijayawada: ఫెడరల్ బ్యాంక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రోజు రోజుకు విస్తరిస్తుంది. దీనిలో భాగంగానే విజయవాడలోని కానూరులో తన మరో బ్రాంచ్‌ను ప్రారంభించారు. దీనితో పాటుగా ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా కానూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చింది. కేవలం వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం ఇస్తుంది. ఫెడరల్ స్కిల్ అకాడమీ పేరుతో డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. సుమారు మూడు నెలలు పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు.
మూడు నెలల శిక్షణాకాలం పూర్తి అయిన తరువాత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం అకాడమీలో ట్యాలీ, ఎమ్మెస్ ఆఫీస్ ఇతర కోర్సులను అందిస్తున్నారు. ఫెడరల్ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో ఈ స్కిల్ అకాడమీలను నడిపిస్తున్నట్లు ప్రాంతీయ కార్యాలయ అధిపతి జయ శేఖర్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఫెడరల్ స్కిల్ అకాడమీలు మొత్తంగా ఆరింటిని ఏర్పాటు చేసినట్లు జయ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే విజయవాడ కానూరులో ఏర్పాటు చేసిన స్కిల్ అకాడమీ దేశంలోనే ఏడోదని చెప్పారు. డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు స్కిల్ అకాడమీ సదావకాశం కల్పిస్తుందని అన్నారు.