ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: హరేంథిర ప్రసాద్ - Download C Vigil App in Play store
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 10:00 AM IST
Election Commission Appeals to Download C-Vigil App: ఎన్నికల్లో అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, నగదు, మద్యం పంపిణీ ఇలాంటి అంశాలేవైనా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా సీ-విజిల్ యాప్ను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా పారదర్శకంగా నిర్వహించటంలో ప్రజలు భాగస్వామ్యం వహించినట్టు అవుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు, ప్రజలు భాగస్వామ్యం వహించేలా ఎక్కువ మంది సీ-విజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. సిటిజెన్ విజిలెన్స్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రజలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైన చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఈ యాప్ ద్వారా ఫోటోలు, వీడియోలు తీసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. సీ- విజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా, నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి ఫిర్యాదు చేసే బదులు సీ-విజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే అతి వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు.