సీఎం జగన్ చెడు పనులు చేయడంలో ధైర్యాన్ని చూపుతున్నారు: సీపీఐ నారాయణ - సీపీఐ నారాయణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 8:56 PM IST
CPI Narayana Sensational Comments on CM YS Jagan: సీఎం జగన్ చాలా ధైర్యవంతుడని, అయితే ఆ ధైర్యాన్ని చెడు పనులు చేయడంలో చూపుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసమే లక్ష్యంగా పాలన సాగిస్తూ, మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. అటు పదేళ్ల పాలనలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయకపోగా ఎల్ఐసీ, స్టీల్ ప్లాంట్ లాంటి దిగ్గజ సంస్థలను అమ్మేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.
అదే విధంగా ఎలక్టోరల్ బాండ్ల మీద సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్, రైల్వే జోన్, కడప స్టీలు అంశాలను బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కనీసం ఆ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రధాని మోదీ పేదలు, మహిళలు, యువత, రైతులకు ఎంతో మేలు చేస్తే ఈ రోజు అన్నదాతలు దిల్లీని ఎందుకు ముట్టడిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 20వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని నారాయణ వెల్లడించారు.