5 ఫైళ్లపై సంతకాలు చేసి సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారు: ఎమ్మెల్యే శ్రావణిశ్రీ - Congratulation Meeting to CBN - CONGRATULATION MEETING TO CBN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 15, 2024, 2:56 PM IST
Congratulatory Meeting to Chandrababu at Singanamala: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు మేలు చేసే 5 ఫైళ్లపై సంతకాలు చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల భూములు కాపాడిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. ఇచ్చిన హామీ మేరకు మాట నెరవేర్చినందుకు అనంతపురం జిల్లా సింగనమల ఎంపీడీవో కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రావణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
Singanamala MLA Bandaru Sravani Sree: సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంతకాలు చేసిన చంద్రబాబుకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదేళ్లుగా చీకట్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు రూపంలో ఇప్పుడే వెలుగు వచ్చిందన్నారు. జగన్ నిరంకుశత్వానికి అన్న క్యాంటీన్ల మూసివేత, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక నిదర్శనంగా ఆమె పేర్కొన్నారు. పింఛన్ల పెంపుతో అవ్వా తాతలు, నిరాశ్రయులు, దివ్యంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు శ్రావణిశ్రీ తెలిపారు.