మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది: చంద్రబాబు - డీజీపీకి చంద్రబాబు లేఖ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 10:36 PM IST
Chandrababu Naidu Writes A Letter To DGP: జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. చొక్కా చేతులు మడతపెట్టాలని సీఎం చేసిన వ్యాఖ్యలే దాడులు కారణమని పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగిన దాడులను ఇప్పటివరకు సీఎం, మంత్రులు ఖండించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో వైఎస్సార్సీపీ రౌడీలు దాడులు తీవ్రతరం చేశారని పేర్కొన్నారు. వారం వ్యవధిలో జరిగిన నాలుగు దాడులను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.
గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్రమాలపై వార్తలు రాస్తే వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మీడియాకు చెందిన ఆస్తులు, వ్యక్తులపై దాడులకు తెగబడుతున్నారు. మెున్న ఇసుక రీచ్‌లలో అక్రమాలకు పాల్పడుతున్న వార్తను రాసేందుకు వెళ్లిన ఈనాడు విలేఖరిపై దాడిచేయగా, సీఎం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడికి తెగబడ్డారు. నిన్న కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయంపై దాడులు చేశారు. ఇంతలా దాడులు చేస్తున్నా, వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేసే వారినే వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులతో పాటుగా, ప్రతిపక్ష పార్టీలు సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. తాజాగా దాడుల అంశంపై నారా చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.