సజ్జలను ముందస్తుగా అరెస్ట్ చేయాలి: బోండా ఉమా - Bonda Uma Demand
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 7:32 PM IST
TDP Leader Bonda Uma: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు ముందే వైఎస్సార్సీపీ చేతులెత్తేసిందని తెలుగుదేశం నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్న వైఎస్సార్సీపీ మంత్రులు, ప్రజానిధులు అధికారం కోల్పోనుండటంతో అవినీతి నేతల్లో భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. వైనాట్ 175 అనే దగ్గర నుంచి వైనాట్ పులివెందుల అనే స్థాయికి వైఎస్సార్సీపీ దిగజారిందని ఎద్దేవా చేశారు.
రేపు వెలువడే ఫలితాలతో రాష్ట్రానికి మోక్షం లభిస్తుందని బోండా ఉమా తెలిపారు. సజ్జల మాటలు విని వైఎస్సార్సీపీ నేతలు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నేతలు కుబేరులుగా మారి కార్యకర్తలను రెచ్చగొట్టి మళ్లీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సజ్జలను ముందస్తుగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 13 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఇంతలా అప్పులు చేసిన ఘనత వైఎస్సార్సీపీకి చెల్లుతుందని దుయ్యబట్టారు. అందుకే ప్రజలు సుస్థిరమైన పాలన కోసం ఓటు వేశారని బోండా ఉమా తెలిపారు.