లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: లంకా దినకర్ - BJP Leader Lanka Dinakar - BJP LEADER LANKA DINAKAR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 9:12 PM IST
BJP Leader Lanka Dinakar Press Meet: దేశాన్ని విభజించు పాలించు అన్నట్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విధానం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. మొదటి నుంచీ హిందువులపై రాహుల్ గాంధీ విషం చిమ్ముతున్నారని, అది అతనికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది హిందూయేతరులను సంతృప్తి పరచడానికి చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు.
విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కశ్మీర్లో వేలాదిమంది హిందువులను ఊచకోత కోస్తే, వారి ఆస్తిపాస్తులు వదులుకుని బ్రతుకు జీవుడా అని పారిపోయారన్నారు. ఆ రోజు వారి బాధల గురించి మాట్లాడని రాహుల్ గాంధీ ఈ రోజు హిందూ సమాజాన్ని అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చెందారు. చివరకు రాాజ్యాంగ పదవిలోని స్పీకర్ను కూడా అవమానించారని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా తన తల్లి సోనియా ప్రవర్తించిన తీరు రాహుల్ గాంధీకి స్పూర్తి కావచ్చేమోనని అన్నారు.