'తగ్గేదేలే' - బెల్ట్‌షాపు కోసం బహిరంగ వేలం పాట - ఎక్కడంటే
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 23, 2024, 4:19 PM IST
Belt Shop Open Auction in Magutur of Prakasam District : రాష్ట్రంలో మద్యం పాలసీ పుణ్యమా అని ఊరూ, వాడాల్లో బెల్టు దుకాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఏకంగా బెల్టు షాపుల కోసం వేలం పాటలు సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్థవీడు మండలం మాగుటూరులో బెల్టు షాపుకి వేలం పాట నిర్వహించటం కోసం ఒకరోజు ముందుగానే గ్రామంలో దండోరా వేశారు. విషయం అందరికీ తెలిసిన తరువాత వేలం పాట నిర్వహించారు. అది కూడా ఎక్కడో చెట్టుకిందో, గుట్టవద్దనో కాదండోయ్ ఏకంగా దేవాలయం ఆవరణంలోనే నిర్వహించటం విశేషం.
పోటా పోటిగా పాడిన వేలం పాటలో గ్రామానికి చెందిన రామ సుబ్బయ్య అనే వ్యక్తి ఏకంగా రూ.7.10 లక్షలకు బెల్టు షాపును దక్కించుకున్నాడు. ఈ డబ్బును గ్రామంలో పండుగలు, జాతరాలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు ఉపయోగించాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. అలాగే వేలంపాట పాడిన వ్యక్తి కాకుండా వేరే వాళ్లు మద్యం అమ్మకుండా తాము బాధ్యత తీసుకుంటామని వ్యాపారికి గ్రామస్థులు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మార్పీ రేటు కన్నా రూ.30 లేక రూ.50లు ఎక్కువ అమ్ముకోవచ్చని గ్రామస్థులు తీర్మానం చేసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది.