జగన్‌ను గద్దె దింపుతాం - వచ్చేది టీడీపీ,జనసేన ప్రభుత్వమే : బండారు శ్రావణి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 1:12 PM IST
Bandaru Sravani in Babu Surety Bhavishyathuku Guarantee: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో తెలుగుదేశం నాయకురాలు బండారు శ్రావణి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ర్యాలీగా బయలుదేరిన ఆమె ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామస్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేని చేతకాని సీఎంను వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుతామని బండారు శ్రావణి తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్రావణి అన్నారు.
తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 2024లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆమె తెలిపారు. 2024లో 'నారా చంద్రబాబు నాయుడు అనే నేను' అనే మాట కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లుగా అరాచక పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆర్భాటాలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయి తప్ప ప్రజలకు ఉపయోగపడలేదన్నారు. వాళ్లు ఇచ్చే పథకాలు కూడా ప్రజలకు ఉపయోగపడలేదని శ్రావణి తెలియజేశారు.