ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు - స్వయంగా వడ్డించిన బాలకృష్ణ - MLA Balakrishna Gives IFTAR Party - MLA BALAKRISHNA GIVES IFTAR PARTY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 10:46 PM IST
Balakrishna Organized Iftar Dinner Party for Muslim Brothers : పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లింసోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అల్హిలాల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో బాలకృష్ణ పాల్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు విందును బాలయ్య దగ్గరుండి వడ్డించారు. ఆనందం వ్యక్తం చేసిన ముస్లింలు సైతం బాలకృష్ణకు స్వయంగా తినిపించారు. ఈ దువాలో బాలయ్యతో పాటు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బి.కె. పార్థసారథి, మత పెద్దలు, మైనార్టీ సోదరులు, పార్టీ శ్రేణులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్కొన్నారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు కఠోర దీక్షతో ఉపవాసాలు చేస్తారు. ఇంత నియమ నిష్టలతో దీక్షలు చేస్తున్నావారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే మైనార్టీ సోదరుల కోసం పలు సంక్షేమ పథకాలను తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. టీడీపీ పార్టీ పుట్టినప్పచినుంచి ముస్లిం సోదరులకు తగిన గౌరవం ఇస్తున్నామని తెెలిపారు. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చాక గతంలోకంటే మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామి ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. కాబట్టి ప్రతిఒక్కరు కూటమి ప్రభుత్వనికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.