'బకాయిలు అన్నీ అడగట్లేదు - పదవీ విరమణ చేసిన వారివి ముందు చెల్లించండి'
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2024, 5:13 PM IST
AP JAC Bopparaju Venkateswarlu Comments: కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు రెవెన్యూ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ విధానంతో ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చి ఉద్యోగుల ఆత్మ గౌరవం పెంచారన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవాలని బొప్పరాజు కోరారు.
ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు బకాయిలు అందక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే విడుదల చేసేలా చూడాలని ఏపీజేఏసీ అమరావతి విజ్ఞప్తి చేసింది. అందరి బకాయిలు ఒకేసారి చెల్లించాలని తాము అడగట్లేదని చెప్పిన ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు, ముందుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు. గతంలో ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నందున ఉద్యోగులకు ఎవరూ అప్పు ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు వస్తున్నందున ఉద్యోగుల, పింఛనుదారుల పరిస్థితి బాగుందన్నారు.