ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి: ముఖేష్ కుమార్ మీనా - AP CEO Review with Collectors
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 3:34 PM IST
AP CEO Review with Collectors: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న దృష్ట్యా అధికార యంత్రాంగం త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్ష చేపట్టారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆయన హెచ్చరించారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీ ముమ్మరం చేయాలన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచితాల పంపిణీ కట్టడిపైనా దృష్టి పెట్టాలని సూచనలు ఇచ్చారు.
మరోవైపు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకు నేరుగా అందించొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే స్పష్టం చేశారు. సచివాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 4 - 5 గంటల మధ్య ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందించొచ్చని శుక్రవారం వెల్లడించారు. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఎన్నికల ఫిర్యాదులను నేరుగా అందించవచ్చని స్పష్టం చేశారు. పని దినాలతో పాటు సెలవు రోజుల్లోనూ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.