strange noise from Starliner: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, విల్‌మోర్‌ల రోదసి యాత్రలో సాంకేతిక కారణాలతో నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక మరింత ఆలస్యం అవుతుందని, 2025 ఫిబ్రవరి వరకు వ్యోమగాములిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోనే ఉండనున్నారు. సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 14నే ఆ ఇద్దరూ భూమికి తిరిగి రావాల్సింది. అయితే, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఫలితంగా మరికొన్ని నెలలు ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోనున్నారు.
2025 ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోనే సునీత విలియమ్స్
రోదసిలో ఉన్న వ్యోమగామి విల్‌మోర్ స్పేస్ సెంటర్‌లోని మిషన్ కంట్రోల్‌కి ఒక మెసేజ్ పంపినట్లు 'ఆర్స్ టెక్నికా' తన నివేదికలో వెల్లడించింది. ఇందులో విల్‌మోర్ ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. "నాకు స్టార్‌లైనర్‌పై ఒక సందేహం ఉంది, దాని స్పీకర్ నుంచి ఒక వింత శబ్దం వస్తోంది, అది ఎందుకు ఇలాంటి శబ్దం చేస్తుందో నాకు తెలియడం లేదు. నేను స్టార్‌లైనర్‌లో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు స్పీకర్ నుంచి ఈ వింత శబ్దాన్ని గమనించా"అని విల్‌మోర్ ఒక మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. విల్‌మోర్ పంపిన మెసేజ్‌ను వాతావరణ శాస్త్రవేత్త రాబ్ డేల్ 'ఆర్స్ టెక్నికా'తో పంచుకున్నారు. ఇదే విషయాన్ని రోదసిలో ఉన్న విలియమ్స్-విల్‌మోర్ సైతం పరస్పరం చర్చించుకున్నారు.