YSRCP Victims Complaint to TDP Leaders about Anarchy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్సార్సీపీ బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ బాధితుల కోసం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రతిరోజు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా చాలా సమస్యలను అప్పటికప్పుడే అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరిస్తున్నారు. శుక్రవారం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ. షరీఫ్ ఫిర్యాదులు స్వీకరించారు.
తన పొలానికి వెళ్లడానికి మా భూముల్లోంచి దారి కావాలని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అండతో ఆ పార్టీ నాయకుడు రాటకొండ సుబ్బారాయుడు తనను పోలీసులతో కొట్టించారని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని తిమ్మయ్యగారిపల్లెకు చెందిన హరిబాబుతో పాటు పలువురు గ్రామస్థులు టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. నాటి తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా సుబ్బారాయునికే సహకరించారని, వారి ఒత్తిడితో గతంలో ఓ కుటుంబం సైతం ఆత్మహత్య చేసుకుందని వాపోయారు.