YSRCP Sarpanch Husband People Misappropriation of Funds in Eluru District : ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని బొర్రంపాలెం గ్రామ మేజర్ పంచాయతీలో సుమారు 7 వేల మంది జనాభా ఉన్నారు. ఈ పంచాయతీకి వైఎస్సార్సీపీ బలపరిచిన కలపర్తి వెంకటేశ్వరమ్మ సర్పంచిగా ఎన్నికయ్యారు. భార్య హోదాని అడ్డుపెట్టుకుని మునేశ్వరరావు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సామాజిక కార్యకర్త పాండురంగ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా అక్రమాలకు సంబంధించి పలు విషయాలు వెలుగుచూశాయి.
2021 నుంచి 2024 వరకు వివిధ పన్నుల రూపంలో వసూలు చేసిన రూ. 14 లక్షల ఖజానాకి జమ చేయనట్లు తెలిసింది. పలుచోట్ల చేతి పంపుల నిర్వహణ పేరుతో లక్షల్లో బిల్లులు పెట్టి స్వాహా చేసినట్లు తేలింది. గ్రామం నడిబొడ్డు నుంచి చివరి వరకు ఉన్న చెత్త డంపింగ్ యార్డు వరకూ కచ్చా డ్రైన్ సహా గ్రావెల్ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో చూపి నిధులు దోచేశారు.
పంచాయతీకి చెందిన తాగునీటి ట్యాంకు స్థలాన్ని స్థానిక గుత్తేదారు కబ్జా చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డీఎల్పీఓ కారు అద్దె పేరుతో రూ. 12 వేల చొప్పున నెలనెలా పంచాయతీ ఖాతా నుంచి చెల్లించడం అక్రమాలకు పరాకాష్టగా చెప్పొచ్చు. గ్రామంలో మూడు లేఔట్లకు అనుమతులు ఇవ్వగా ప్రజా అవసరాల కోసం లే ఔట్లలో కేటాయించాల్సిన 10 శాతం భూమని కేటాయించలేదు. పంచాయతీ కార్యదర్శి వారి నుంచి డబ్బులు తీసుకుని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.