YSRCP Negligence Become Curse For Polavaram Project: రివర్స్ టెండర్ విధానాలు, ఆదా అంటూ హడావుడి చేసిన జగన్ సర్కారు పోలవరంపై పెను భారం మోపింది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. అంచనాలకు 11,704 కోట్ల రూపాయలకు పెంచుతూ ప్రతిపాదనలు అందజేశారు. జగన్ ఐదు సంవత్సరాల పాలన పుణ్యాన ఒక్క ప్రధాన డ్యాంలోనే రూ.4,512 కోట్ల మేర అదనపు భారం పడింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ విధానాలతో పోలవరం ప్రాజెక్టుపై పెను భారం పడింది. రివర్స్ టెండర్లతో రూ.628 కోట్ల ఆదా అంటూ అప్పట్లో జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. తీరా పోలవరంపై వేల కోట్ల భారానికి వైఎస్సార్సీపీ సర్కార్ కారణమైంది. నాటి నష్టాల ఫలితంగా ఇప్పుడు మళ్లీ అంచనాలు సవరించేందుకు అధికారులు ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపారు. ప్రస్తుతం ప్రధాన డ్యాం అంచనాలు రూ.11,704 కోట్ల 94 లక్షలకు పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సవరించిన అంచనాలను జలవనరుల శాఖ మదింపు చేస్తోంది.
ప్రధాన డ్యాంకు అనుసంధానంగా మరో 6 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ పనులు ఏవీ ఈ అంచనాల్లోకి రావు. కుడి, ఎడమ కాలువలు, భూసేకరణ, పునరావాసం ఇందులో చేరవు. ఈ లెక్కన జగన్ ప్రభుత్వంలో ఒక్క ప్రధాన డ్యాంలోనే ఏకంగా రూ.4,512 కోట్ల మేర అదనపు భారం పడినట్లైంది. ఈ అంచనాలపై ఏ స్థాయిలో కోత పడుతుందో చూడాలి.