YSRCP Candidates List : గ్రామాల్లోకి వెళ్లండి, ఇంటింటికీ తిరగండి. జనంలోనే ఉండండి అంటూ ఎమ్మెల్యేలను సీఎం జగన్ పదేపదే బెదిరిస్తుంటే ప్రజాసమస్యల గుర్తింపు, పరిష్కారంపై ఎంతో పట్టుదలగా ఉన్నారని జనం భ్రమించారు. తమ ప్రజాప్రతినిధుల్లో మార్పు తేవడానికి కృషి చేస్తున్నారని సొంతపార్టీ కార్యకర్తలు భావించారు. తీరా ఎన్నికలు వచ్చాక, వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించాక అవాక్కయ్యారు. సీఎం హెచ్చరికల వెనుక ఆంతర్యం అంతుబట్టక పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎమ్మెల్యేలు గడప గడపకూ తిరిగారు.
అలాంటి వారిలో అత్యధికులు బలిపశువులై టికెట్లు కోల్పోయారు. జగన్ టికెట్ ఇచ్చిన వారిలో అత్యధికులు భూకబ్జాలు, అక్రమాలు, అరాచకాలు, ఇసుక, మట్టి, మైనింగ్, సెటిల్‌మెంట్లు, రౌడీయిజం, కుంభకోణాల్లో ఆరితేరిన వారే ఉన్నారు. ఓటర్ల జాబితాలో లెక్కకు మించి అక్రమాలకు పాల్పడటం వంటి ప్రత్యేక అర్హతలు ఉన్నవారూ కొందరున్నారు.
చిత్తూరు జిల్లాలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఇలా ఒక్కటేమిటీ దోపిడీకి ప్రత్యామ్నాయ పదాలు దొరకనంత స్థాయిలో చెలరేగుతున్న ఒక సీనియర్ మంత్రికి సిట్టింగ్ సీటునే ఖరారు చేశారు. తానో సామంతుడిలా ఆ ప్రాంతంలో రాజ్యమేలుతున్న ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్, దుంగల దొంగలకు పోలీసులను ఎస్కార్టుగా పెట్టి మరీ జిల్లా దాటిస్తున్నారు.
కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam
ఈ మంత్రి సిఫార్సుతోనే అదే జిల్లాలో ఒక దళిత ఎమ్మెల్యేని బలిపశువును చేసిన సీఎం జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇదే జిల్లాలోని మరో మంత్రి తన నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి అవినీతికి పాల్పడ్డారని, సొంత పార్టీ వారమైనా తమ వద్దే డబ్బులు వసూలు చేశారని ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపించారు. వారి గోడును ఏమాత్రం పట్టించుకోకుండా ఆ మంత్రికి జగన్‌మళ్లీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు.
చిలకలూరిపేట వైసీపీ ఇంఛార్జి పదవి కోసం మంత్రి విడదల రజినికి ఆరున్నర కోట్ల రూపాయలు ఇచ్చానంటూ ఆ నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్‌నాయుడు ఇటీవల బహిరంగంగానే ఆరోపించారు. నియోజకవర్గంలో మంత్రి కుటుంబ సభ్యుల అవినీతిపైనా ఆయన ఆరోపణలు గుప్పించారు. ధైర్యం ఉంటే చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు. స్థానికంగా వ్యతిరేకతను కూడగట్టుకున్న ఆమె అక్కడైతే గెలవడం కష్టమని భావించిన వైసీపీ అధిష్ఠానం ఇప్పుడు గుంటూరు పశ్చిమకు మార్చింది.
ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో దోపిడీ కొనసాగించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపట్టిన భూసేకరణలో లక్షల రూపాయల్లో ఉన్న భూముల ధరలను కోట్ల రూపాయలకు పెంచి ప్రజాధనాన్ని నొక్కేశారు. విచ్చలవిడిగా ప్రైవేటు పంచాయతీలు, సెటిల్‌మెంట్లు చేస్తూ దోచుకున్నారు. ప్రతి పనికీ కమీషన్‌తో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈయనకు ఇప్పుడు పక్క జిల్లాకు బదిలీ చేసి అక్కడ టికెట్ కేటాయించారు.
యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు - చూసీచూడనట్లు ఉంటున్న అధికారులు - YSRCP Election Code Violations
గుంటూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్ల రూపంలో ప్లాట్లు తీసుకుంటూ, మట్టి మాఫియాలో వాటాలు దండుకుంటూ, మహిళలతో అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీ పరువు తీసిన నేతకు, కృష్ణా జిల్లాలో సంక్రాంతి ముసుగులో పేకాట, క్యాసినో లాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించిన మరో నేతకూ జగన్ టికెట్లు ఇచ్చారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అవినీతి, అక్రమాలు, అరాచకాలను ఆధారాలతో సహా నిరూపిస్తానని వైసీపీ నేత, పట్టణ సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు కాళ్ల గౌరీశంకర్ బహిరంగంగానే ఆరోపించారు.