YSRCP leaders Irregularities: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా ఐదేళ్లలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఊర్లపైపడి దోచుకున్నారు. గత ఎన్నికల ముందు సొంతిల్లు కూడా అమ్ముకుని రాజకీయం చేస్తున్నామంటూ బీద అరుపులు అరిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి, ఇప్పుడు ఏకంగా 500 కోట్లకు అధిపతి అయ్యాడు. అక్రమార్జనలో ఆయనకు మించిన తోపులేడని జిల్లాలో చెప్పుకుంటున్నారు. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు మొదలుకుని ఎర్రమట్టి, పేదల బియ్యం వరకు దేన్నీ వదలలేదు.
అక్రమ సంపాదన మొదలుపెట్టిన అనతికాలంలోనే హైదరాబాద్‌లో సుమారు 14 కోట్లతో విల్లా, 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, 4 కోట్ల విలువైన మరో ఇల్లు కొనుగోలు చేశారు. జీవనోపాధికి ఉన్న పొలాలు అమ్ముకున్నామని చెప్పుకున్న ఆ ప్రజాప్రతినిధి కుటుంబానికి ఇప్పుడు కర్ణాటక, విజయవాడ, విశాఖలో వందల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను సైతం చెరబట్టారు. పరిశ్రమలను సైతం కమీషన్ల కోసం వేధించి రాష్ట్రం నుంచి తరిమేశారు.
అనాథాశ్రమాల నుంచి ప్రార్థనాలయాల వరకూ - వారి కన్ను పడితే అంతే!
విల్లాలంటే ఎంతో మోజు: అనంతపురం గ్రామీణ పరిధిలో స్థిరాస్తి వ్యాపారం చేయాలంటే సదరు ప్రజాప్రతినిధికి ముడుపు చెల్లించాల్సిందే. విల్లాలంటే ఎంతో మోజు ఉన్న ఆ నేతకు అన్ని వసతులున్న ఒక విల్లాతోపాటు ఎకరాకు 10 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో అక్కడి భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. దీని కారణంగా ఒక్క రాప్తాడు పరిధిలోనే 500కు పైగా అనధికారిక వెంచర్లు వెలిశాయి. వీటి నుంచి వారు దాదాపు 50 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఓ స్తిరాస్థి వ్యాపారి విలాసవంతమైన విల్లాలు నిర్మించారు.
వైసీపీ ప్రజా ప్రతినిధి సోదరుడు వేధించి వెంటపడి 2 కోట్ల విలువైన విల్లా రాయించేసుకున్నారు. అనంతపురం సమీపంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తుండటంతో ప్రజాప్రతినిధి కుటుంబం కన్ను ఆ విల్లాలపై పడింది. వారిని బెదిరించి హైదరాబాద్‌లో 14 కోట్ల విలువైన విల్లాను వారి పేరిట రాయించేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో భూముల క్రయవిక్రయాలన్నీ ఆ ప్రజాప్రతినిధి కుటుంబం కనుసన్నల్లోనే జరగాలి, లేదంటే వారే వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతుంటారు. నకిలీ పట్టాలతో మొత్తం భూమిని కాజేస్తారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ పేద కుటుంబానికి చెందిన ఎసైన్డ్ భూమిపై సదరు నేత సోదరుడి కన్నుపడింది.
రైతు ప్రతిఘటించడంతో ఆయన పొలంలో మామిడి చెట్లు నరికివేయించారు. ఆ తర్వాత ఆ భూమి ప్రభుత్వం మరొకరికి కేటాయించిందంటూ దొంగపత్రాలతో దౌర్జన్యానికి దిగారు. పేదల భూములనే కాదు, ప్రభుత్వ భూములను ఈ అన్నదమ్ములు వదిలిపెట్టరు. అనంతపురంలో కార్పొరేషన్ భూమినే కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. కురుగుంటలో ఎస్టీ మహిళకు చెందిన ఐదెకరాల భూమి ఆక్రమించేందుకు ప్రజాప్రతినిధి సోదరుడు తీవ్రంగా ప్రయత్నించాడు. నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు అనుచరుల ద్వారా అందులో ఎకరం ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. బాధితురాలు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా వారి అరాచకాలు ఆగలేదు.
సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం
రజకుల భూములనూ ఆక్రమించుకున్నారు:ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రజకుల కోసం అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లిలో కేటాయించిన ఐదెకరాలు, రాప్తాడు మండలం ఎర్రగుంటలోని పదెకరాలను ప్రజాప్రతినిధి సోదరుడు ఆక్రమించుకున్నారు. వీటి విలువ సుమారు 10 కోట్ల వరకు ఉంటుంది. ఉప్పరపల్లిలో రైతుల పేరిట 3 కోట్ల విలువైన భూమలు కాజేశారు. గత ప్రభుత్వం ఆటోనగర్‌కు 58 ఎకరాలు కేటాయించింది. ఆ భూమిలో ఓ 5 ఎకరాలపై ప్రజాప్రతినిధి కుటుంబం కన్నేసింది.
ఆటోనగర్‌కు 27 ఎకరాలు మాత్రమే కేటాయించారని, మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. రికార్డులు పక్కాగా ఉండటంతో అధికారులు ఒప్పుకోలేదు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ భూములపైనా కన్నేయగా విషయం పత్రికల్లో రావడంతో వెనక్కి తగ్గారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని సదరు ప్రజాప్రతినిధి సోదరులు వదల్లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ బియ్యం సేకరించి కర్ణాటక రైస్ మిల్లులకు అమ్ముకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.