YSRCP Leaders Encroached Heavy Lands in Kadapa : కడప నగరంలో వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్నే చెరబట్టి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం వారి అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోంది. గత ఐదేళ్లు వైఎస్సార్సీపీ నాయకుల బరితెగింపును కళ్లప్పగించి చూసిన అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
YSRCP Leaders Occupied Government Lands : కడపలోని పోలీస్ పెట్రోల్ బంకు పక్కనున్న30 సెంట్ల స్థలాన్ని డిప్యూటీ మేయర్‌గా పని చేస్తున్న వ్యక్తి బినామీ పేర్లతో లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అన్బురాజన్ ఎస్పీగా ఉన్న సమయంలో 2023లో ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని రెండతస్థుల నిర్మాణాలు చేపట్టారు. కింద నాలుగు గదులు నిర్మించి హోటళ్లు, వ్యాపారాలు నడిపిస్తున్నారు.! ఈ నిర్మాణాలకు కడప నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతే తీసుకోలేదు.
'దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన ఈ స్థలం కబ్జాపై సీఎం చంద్రబాబుకు సర్వే నంబర్లతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. పోలీసు కార్యాలయానికి చెందిన ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇటీవల చెప్పారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు డిప్యూటీ మేయర్‌తో కుమ్మక్కై భవనం కూల్చకుండా చెరిసగం పంచుకోవాలనే ప్రతిపాదన తెచ్చినట్లు కడపలో ప్రచారం సాగుతోంది.' -ఆంజనేయులు, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్