VijayaSai Reddy Resigns from MP : రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. దీనిని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారని తెలిపారు. ఇక రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Vijaya Sai Reddy on Resignation : తన లాంటి వాళ్లు వెయ్యిమంది పార్టీని వీడినా జగన్‌కు ప్రజాదరణ తగ్గదని విజయసాయిరెడ్డి అన్నారు. లండన్‌లో ఉన్న జగన్‌తో ఫోన్లో మాట్లాడి అన్ని వివరించానని ఆ తర్వాతే తాను రాజీనామా పత్రం సమర్పించినట్లు చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక రాజకీయాలపై మాట్లాడటం తగదని పేర్కొన్నారు. ఇక ప్రాథమిక సభ్యత్వం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలిసి ఏరోజూ అసత్యాలు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. ఎవరైనా నేను అసత్యాలు చెప్పానంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి నుంచి జగన్ వరకు మూడు తరాలుగా నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ జీవితకాలంలో ఏ రోజూ ఆ కుటుంబంతో విభేదాలు రావు. పాత కేసుల విషయానికొస్తే 2011 ఆగస్టు 10న ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఎన్నో ఆశలు చూపించి తనను అప్రూవర్‌గా మారాలని ఎంతో ఒత్తిడి చేశారు. దైవాన్ని నమ్మిన వ్యక్తిగా నమ్మకద్రోహం అనేది ఉండదు. ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిగా అప్రూవర్‌గా మారేందుకు నిరాకరించా. - విజయసాయిరెడ్డి
'కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాకినాడ సీపోర్ట్స్ కేసు పెట్టారు. నాకు లుకౌట్ నోటీసు ఇచ్చారు ఏ-2గా చేర్చారు. ఇంతవరకు నన్ను సీఐడీ వాళ్లు పిలవలేదు. వ్యాపార లావాదేవీలు లేవని చెప్పా. నాపై చేసిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్పా. కేవీ రావు చెప్పేది నిజమైతే ఆయన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పమనండి. నేను నిజంగా విక్రాంత్‌రెడ్డిని ఆయన వద్దకు పంపించానన్న విషయంపై ప్రమాణం చేయమనండి. నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఏరోజు నాకు ఎవరూ చెప్పలేదు. కేసు పెట్టిన తర్వాతే నాకు కూడా విషయాలన్నీ తెలిశాయని' విజయసాయిరెడ్డి వివరించారు.