YSRCP LEADER IRREGULARITIES ANAKAPALLI DISTRICT: అనకాపల్లికి జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయిన ఆయన. అభివృద్ధి చేస్తానంటూ గెలిచి, ఆ తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి కాకుండా సొంత ఎదుగుదలపైనే దృష్టి నిలిపారు. ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ ‘నియోజకవర్గంలో పవర్‌ఫుల్’ అంటూ గల్లా ఎగరేస్తుంటారు. 'కన్నా' అని కోరినా 'బాబు' అని బతిమిలాడినా వినేది లేదు. వసూళ్లు ఆపేది లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే బూతుల పురాణం అందుకుంటారు. జిల్లాలో ఈ నాయకుడి దందా ఇంతా అంతా కాదు.
విశాఖ నగరానికి సమీపంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అది. అచ్యుతాపురం సెజ్ అక్కడే ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి. విస్తృత తీర ప్రాంతమూ ఉంది. ఇంతటి కీలక ప్రాంతంలో వివాదాస్పద భూములపై కన్నేసే ఆయన ఎలాగోలా వాటిని సొంతం చేసుకుంటారు. పారిశ్రామికవాడలో మట్టి పోయాలన్నా, ఇటుక పేర్చాలన్నా, ఆఖరికి పరిశ్రమల వ్యర్థాలు అమ్ముకోవాలన్నా సరే ఈయనకు ముడుపులు చెల్లించాల్సిందే. లేకపోతే అడ్డంకులు సృష్టిస్తారు. అయినా దారికి రాకపోతే అనుచరులతో దాడులు చేయిస్తారు. ప్రతిపక్షాలతో కలిసి సొంత పార్టీ నేతలే అఖిలపక్షం ఏర్పాటు చేసి మరీ, ఆయన దందాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
లొంగదీసుకోవడంలోనూ ఆయనను మించిన 'రాజు' లేరు: భూములు అన్నా, గ్రావెల్ అన్నా ఆ నేతకు ఎంతో ఇష్టం. నియోజకవర్గంలో ఎక్కడ లే అవుట్ వేసినా, కొండల తవ్వకాలు జరిగినా అందులో ఈ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లే. అక్రమ లే అవుట్లు వేయించి అమ్ముకోవడం, ఆ భూములు కొనుగోలు చేసిన వారిని వాళ్లే భయపెట్టి తక్కువ ధరకు స్వాధీనం చేసుకుంటారు. ఆయన కన్ను పడితే కొండలు పిండి, భూములు హాంఫట్ కావాల్సిందే. అందుకు ఎదురుచెప్పేవారిని నయానో, భయానో లొంగదీసుకోవడంలోనూ ఆయనను మించిన 'రాజు' లేరు. రాంబిల్లి మండలంలో పెదకలవలాపల్లి, వేల్చూరు, పంచదార్ల, కొత్తూరు గ్రామాల్లో కొండలను గుల్లచేసి భారీగా గ్రావెల్‌ను తరలించారు.
సెజ్‌కి ఉండాల్సిన రక్షణ గోడను పగలగొట్టించి మరీ: అక్రమ తవ్వకాలు జరిగాయని నిర్ధారణ చేసిన గనుల శాఖ 14 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశించినా, ఒక్క రూపాయీ చెల్లించలేదు. ఆ ప్రాంతంలో ఎవరు గుత్తేదారులుగా ఉన్నా అవసరమైన గ్రావెల్ ఈయనే సరఫరా చేస్తారు. దొప్పెర్ల మండలంలో ‘బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కు అవసరమైన గ్రావెల్‌ను ఈయనే తరలించారు. నునపర్తి, నడింపల్లి గ్రామాలతో పాటు పోలవరం ఎడమ కాల్వ గట్టుపై ఉన్న కంకరను సైతం పూర్తిగా దోచుకున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో ఓ టైర్ల కంపెనీ కొత్తగా స్థాపించారు. ఆ స్థలాన్ని చదును చేయగా వచ్చిన సుమారు లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను విక్రయించి ఈ నేత సొమ్ము చేసుకున్నారు. గ్రావెల్ తరలింపునకు వీలుగా సెజ్‌కి ఉండాల్సిన రక్షణ గోడను పగలగొట్టించి మరీ ఈ వ్యాపారం కొనసాగించారు.
ఈ నేతకు వెన్నతో పెట్టిన విద్య: ఎక్కడ ఏ భూమి వివాదం ఉందంటే అక్కడ వాలిపోతారు ఈ నేతకు సంబంధించిన అనుచరులు. ఎవరిని ఎలా భయపెట్టి భూములను సొంతం చేసుకోవచ్చో ఈ నేతకు వెన్నతో పెట్టిన విద్య. అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఇటీవల చనిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడికి మొత్తం 40 ఎకరాల భూమి ఉండేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను భయపెట్టిన ఈ ప్రజాప్రతినిధి కేవలం నాలుగెకరాలు మాత్రమే ఆయన వద్ద ఉంచి, మిగిలినవి ఎకరా 12 లక్షల చొప్పున కుమారుడి పేరిట రాయించుకున్నారు. గతంలో 22ఏ పరిధిలో ఉండేవన్న కారణం చూపి, ఆవసోమవారంలోని 8 ఎకరాలనూ తక్కువ ధరకే ఆయన నుంచి తీసేసుకున్నారీ నేత.