YSRCP Govt Neglect RTC Buses :ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం ఇది రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నినాదం. సొంత వాహనాలు ఉన్నా ఎక్కువ మంది ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మెుగ్గు చూపుతుంటారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. డొక్కు బస్సులకే పైపై మెరుగులు దిద్ది నడపడంతో ఆర్టీసీ ప్రయాణం అంటే గాలిలో దీపంలా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీని ప్రగతిబాట పట్టించాలని సిబ్బంది కోరుతున్నారు.
YSRCP Govt Not Introduce New Buses :ఆర్టీసీ బస్సు చక్రం ప్రగతికి చిహ్నాంగా ఒకప్పుడు అందరూ భావించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ పాలనతో ఆర్టీసీ ఆర్థిక స్థితి గాడితప్పింది. రవాణ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం కష్టాలను రెట్టింపు చేసింది. గుంటూరు జిల్లా పరిధిలో ఐదు డిపోల్లో మెుత్తం 378 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజుకు లక్షా 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడం కాలపరిమితి చెల్లిన బస్సులకు పైపై మరమ్మతులు చేసి తిప్పడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటునే ప్రయాణాలు సాగించారు.
కాలం చెల్లిన బస్సులు : రాష్ట్రంలోని అతిపెద్ద ఆర్టీసీ డివిజన్లలో ఉమ్మడి గుంటూరు డివిజన్ ఒకటి. రాష్ట్రం నలుమూలలకు గుంటూరు నుంచి బస్సులు నడుస్తుంటాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 13, బాపట్ల జిల్లాలో కలిసిన చీరాల, ప్రకాశం జిల్లా అద్దంకి డిపోలతో కలిసి మూడు జిల్లాల్లో మొత్తం 15 డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 1100 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో సుమారు 300 అద్దె బస్సులు ఉన్నాయి. మిగిలిన 800 బస్సుల్లో 300 కాలం తీరినవే! 12 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులను నిబంధనల ప్రకారం కాలం తీరినవిగా పరిగణిస్తారు. వాటిని నడపడం డ్రైవర్లకు కష్టమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టమే. అటు ప్రయాణికులకు ప్రాణాంతకం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుండటంతో కొత్తబస్సులను తీసుకురావాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.